సెల్ రేడియేషన్

( శ్రీయుతడాక్టర్‌ ఎంవి రమణయ్య - డాక్టర్‌ రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల - నెల్లూరు)
 
మన భారత దేశ జనాభా సుమారు 120 కోట్లు. పిల్లలను తప్పిస్తే దాదాపు 50 కోట్ల మంది సెల్‌ఫోన్లను వాడటం ఆశ్చర్యకరమైన విషయం. 20 ఏళ్ల కిందట సెల్‌ఫోను ఒక విలాస వస్తువు. ప్రస్తుతం నిత్యావసర వస్తువు. సెల్‌ఫోన్‌ లేని వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదేమో. దీన్ని వాడకుండా ఉండటమనేది కూడా జరిగని పని.  ఇది ఎంత ఉపయోగకరమో, అంత ప్రమాదకారి అనే సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. సెల్‌ఫోన్ల నుంచి విడుదలయ్యే ‘ఎలక్ట్రోమేగటిక్‌ రేడియేషన్‌’ క్యాన్సర్‌ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందంటే సమస్య ఎంత తీవ్రమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్లా సెల్‌ఫోన్‌ వాడకం మానుకోలేం కాబట్టి వాడేటప్పుడైనా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. లేకుంటే అనేక ఆరోగ్య సమస్యలు తప్పవు.
సెల్‌ఫోన్లలోనే కాదు సెల్‌టవర్ల నుంచి కూడా రేడియేషన్‌ విడుదలవుతుంది. ఎందుకంటే ఇవి పనిచేసేవి రేడియో ఫ్రీక్వెన్సీ కిరణాలతోనే. గత సంవత్సరం సెప్టెంబరు నెలలో మన కేంద్ర ప్రభుత్వం సెల్‌టవర్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్‌ విలువను 10 రెట్లు తగ్గించింది. అంటే అంతకు ముందు ఎంత రేడియేషన్‌ను మనం అనుభవించామో తలచుకుంటే భయమేస్తుంది. రేడియేషన్‌ ప్రభావం ఆరోగ్యం మీద అత్యంత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ప్రభావం వెంటనే కనిపించదు. సుమారు పదేళ్ల తర్వాత కనిపిస్తుంది. సాధారణ ప్రజానీకంతో పోల్చుకుంటే సెల్‌ఫోను వినియోగదారుల్లో మెదడు క్యాన్సర్‌ వచ్చే అవకాశం 40 రెట్లు అధికమని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. మెదడు క్యాన్సరే కాక అనేక రకాల క్యాన్సర్‌ వచ్చే అవకాశాం ఎక్కువ మోతాదులో ఉంటుందని అనేక శాస్త్రపరిశీలనా రిపోర్టులు బయటపెడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం మిన్నకుండా ఉంది. చిన్న బిడ్డల మెదడుపై తీవ్ర ప్రభావం కలుగుతుంది. అభివృద్ధి మందగిస్తుంది. గర్భవతులు సెల్‌ఫోన్లు వాడితే గర్భంలో ఉన్న శిశువుల మెదడులపై రేడియేషన్‌ ప్రభావం ఉంటుంది. పైపెచ్చు గర్భస్రావాలు జరిగే అవకాశాలు ఎక్కువ. మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గి వంధత్వం ఏర్పడే సూచనలున్నాయని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
జాగ్రత్తలు
ఇన్ని ఉపద్రవాలను తగ్గించుకోవాలంటే సెల్‌ఫోను వాడకందారులు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు సెల్‌ఫోను వాడకంలోనే కాదు, సెల్‌ఫోను కొనేదగ్గర నుంచే మొదలుపెట్టాలి. ప్రతి సెల్‌ఫోనుకు ఐఎంఇఐ నంబరు ఎలా అయితే ఉంటుందో, అదేవిధంగా ఎస్‌ఎఆర్‌ (స్పెసిఫిక్‌ అబ్జార్షన్‌ రేటు) విలువ ఉంటుంది. ఈ విలువను బట్టి ఆ సెల్‌ఫోను రేడియేషన్‌ తీవ్రతను తెలుసుకోవచ్చు. ఈ విలువ పెరిగేకొద్దీ రేడియేషన్‌ ప్రభావం ఎక్కువ. అందుకని ఎస్‌ఎఆర్‌ విలువ తక్కుగా ఉన్న సెల్‌ఫోను కొనుక్కోవాలి. 2012 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం ఈ విలువ 1.6కు మించకూడదని నిర్ణయించింది. ఈ విలువ కన్నా ఎక్కువ ఎస్‌ఎఆర్‌ విలువ ఉన్న సెల్‌ఫోన్లను వాడకూడదు. కానీ ఇప్పుడు ఎస్‌ఎఆర్‌ విలువ ఉన్నఫోన్లు చెలామణిలో ఉన్నాయి. వీటిని అమ్ముకోవడానికి మన ప్రభుత్వం 2013 సెప్టెంబరు వరకు అనుమతినిచ్చింది. ఆపైన భారతదేశంలో 1.6 కన్నా ఎక్కువ విలువ ఉన్న సెల్‌ఫోన్లను అమ్మడానికి వీలులేదని, ఎస్‌ఎఆర్‌ విలువను సెల్‌ఫోనుపై అతికించాలని నిబంధనను కూడా చేర్చారు. అందుకే సెల్‌ఫోను కొటేటప్పుడు ఎస్‌ఎఆర్‌ విలువను గమనించాలి. వీలైనంత తక్కువ ఎస్‌ఎఆర్‌ విలువ ఉన్న ఫోన్లనే కొనాలి. 1.6 కంటే అధికంగా ఎస్‌ఎఆర్‌ విలువ ఉన్న ఫోన్లు కొనొద్దు.
మాట్లాడటం తగ్గించడం ఎలా?
సెల్‌ఫోన్లలో మాట్లాడటం వీలైనంత వరకు తగ్గించుకోవాలి. తగ్గించడం ఎలా అనిపిస్తుంది? కానీ తగ్గించుకునే మార్గాలు మన చేతిలో ఉన్నాయి. సంక్షిప్త సమాచారానికి మెసేజ్‌ సేవలను ఉపయోగించొచ్చు. అనవసర సంభాషణలు తగ్గించుకోవచ్చు. ల్యాండ్‌లైను ఫోన్లను ఇంట్లో ఉన్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు మన సెల్‌ఫోనులో కాల్‌ఫార్వర్డ్‌ వసతిని ఉపయోగించి, మనకు వచ్చే కాల్స్‌ అన్నింటిని మన ల్యాండ్‌లైన్‌కు వచ్చే రకంగా చేసుకోవచ్చు.
మాట్లాడకపోయినా రేడియేషన్‌?
సెల్‌ఫోన్లలో మాట్లాడేటప్పుడు మాత్రమే రేడియేషన్‌ ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. ఇది తప్పు. సెల్‌ఫోను ఆన్‌లో ఉండి అందులో ఉన్న సిమ్‌ పనిచేస్తుందంటే మనం మాట్లాడకపోయినా ఆ సెల్‌రేడియేషన్‌ కలిగిస్తుందనేది వాస్తవం. మనం మాట్లాడకపోయినా సెల్‌టవరుతో అనుసంధానంలో ఉండేందుకు ఆ సెల్‌ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. తర్వాత రేడియేషన్‌ను విడుదల చేస్తూనే ఉంటుంది. మాట్లాడేటప్పుడు విడుదలయ్యే రేడియేషన్‌ కంటే ఇది పదిరెట్లు ఎక్కువ ఉంటుంది. అందుకే సెల్‌ఫోను జేబులో ఉంచుకోవడం గాని, బెల్టుకు తగిలించుకోవడంగాని, జాకెట్టులో ఉంచుకోవడం గాని చేయరాదు. కానీ ఎక్కువ మందిచేసేది ఇదే. సెల్‌ఫోనును ఒక ప్రత్యేకమైన సంచిలో ఉంచుకోవడం మంచిదే. అలా ఉంచితే రింగు వచ్చినప్పుడు వినిపించడం కష్టంకదా అనిపించొచ్చు. నిజమే దీన్ని అధగమించడం కోసమే. లేకపోతే వైబ్రేషన్‌ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అనివార్య పరిస్థితుల్లో సెల్‌ఫోనును జేబులో ఉంచుకోవాల్సి వస్తే కీపాడ్‌ మన శరీరంవైపునకు ఉండేటట్లుగా జేబులో ఉంచుకోవాలి. వీలున్నప్పుడల్లా మనకు దూరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఆఫీసుకు చేరుకోగానే టేబుల్‌మీద ఉంచుకోవచ్చు. ఇంటికి చేరుకోగానే జేబులో నుంచి తీసి ఇంట్లో ఏదో ఒకచోట పెట్టుకునే ప్రయత్నం చేయాలి.
చెవికి కాస్త దూరంగా….
ఫోన్‌ మాట్లాడేటప్పుడు ఫోనును చెవికి ఆనించి మాట్లాడకూడదు. కనీసం చెవికి ఒక అంగుళం దూరంగా ఉంచుకుని మాట్లాడాలి. శబ్దకాలుష్యంతో చెవికి దూరంగా ఉంచుకోవడం సాధ్యం కానీపక్షంలో నిమిషానికి ఒకసారి అవతలివైపు చెవికి మార్చడం మంచిది. పది నిమిషాల వరకుచెవికి ఆనించి మాట్లాడితే చెవి ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్‌కు పెరుగుతుంది. 20 నిమిషాలు మాట్లాడితే 2 డిగ్రీలకు పెరుగుతుంది. 30 నిమిషాలు మాట్లాడితే చెవి ఎక్కువగా కందిపోతుంది.  సెల్‌ఫోనును చెవి దగ్గరికి తీసుకుపోకుండా ఇయర్‌ఫోన్లు, బ్లూటూత్‌ లాంటి హ్యాండ్‌ఫ్రీ వసతులను ఉపయోగించుకోవడం చాలా శ్రేయస్కరం. బ్లూటూత్‌ మంచిదని దాన్ని ఎప్పుడూ చెవిలోనే ఉంచుకుని ఫోను వచ్చినప్పుడు చెవి దగ్గరే ఆన్‌చేసుకుని వాడడం హానికరం. ఫోను వచ్చినప్పుడు మాత్రమే చెవిలో బ్లూటూత్‌ పెట్టుకునే విధంగా ఉపయోగించాలి. బ్లూటూత్‌గాని, ఇయర్‌ఫోనుగాని వాడేసమయంలో సెల్‌ఫోనును జేబులు ఉంచుకోకూడదు. అలా చేసినందువల్ల చేతులు ఖాళీ అవుతాయేమోకాని రేడియేషన్‌ను తగ్గించుకోలేం. ఆ సమయంలో సెల్‌ఫోను చేతిలో పట్టుకోవడం గాని లేదా టేబుల్‌మీద ఉంచుకోవడం గాని చేయాలి. సెల్‌ఫోనులో మాట్లాడే సమయంలో ఫోనును అరచేతి నిండా పట్టుకుని చెవి దగ్గర ఉంచుకోకూడుద. ఫోను కింది భాగంలో మాత్రమే పట్టుకోవాలి. ఎందుకంటే సాధారణంగా రేడియేషన్‌ సెల్‌ఫోనుపైభాగంలో నుంచే వెలువడుతుంది.
ఎప్పుడు చెవి దగ్గరికి?
మనం ఫోన్‌ చేయాల్సిన వ్యక్తి నంబరును డయల్‌చేసి వెంటనే సెల్‌ఫోనును చెవిదగ్గర పెట్టుకుంటాం. ఎదుటి వ్యక్తి మాట వినిపించే వరకు చెవి దగ్గరికి చేర్చవద్దు. ఎందుకంటే ఫోన్‌లో మాట్లాడేటప్పటి కంటే ఫోనుతో అనుసంధానమయ్యే సమయంలో రేడియేషన్‌ 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. చెవిదగ్గర పెట్టుకోకపోతే ఎదుటివ్యక్తి లైన్‌లోకి వచ్చాడా? లేదా? అనేది మనకెలా తెలుస్తుందని అనిపించొచ్చు. దీన్ని పసిగట్టడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. డయల్‌చేసిన వెంటనే స్పీకరు ఫోనును ఆన్‌చేసి ఉంచితే హలో అని వినిపించగానే ఫోనును చెవిదగ్గరికి చేర్చుకోవచ్చు. డయల్‌ చేసిన తర్వాత ఫోనును మనం చూస్తూ ఉంటే మనఫోనులో టైంకౌంట్‌ ప్రారంభం కాగానే చెవి దగ్గరకు ఫోనును చేర్చుకోవచ్చు. కొన్నిసార్లు ఫోన్లలో ఎదుటి వ్యక్తి జవాబు ప్రారంభంగా కాగానే వైబ్రేషన్‌ వచ్చే సౌకర్యం ఉంది. అప్పుడు చెవిదగ్గరకు ఫోనును చేర్చుకోవచ్చు.
సంకేతాలు (signal) బలహీనంగా ఉంటే వద్దు…
 
సెల్‌ఫోను సంకేతాలు (signal)బలహీనంగా ఉన్నప్పుడు మాట్లాడకపోవడం మంచిది. ఆ సమయంలో మన సెల్‌ఫోను సెల్‌టవరు నుండి ఎక్కువ సిగల్‌ పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. తద్వారా ఎక్కువ రేడియేషన్‌ విడుదల అవుతుంది. సంకేతాలు (signal)ఇంట్లో కంటే వీధిలో ఎక్కువగా ఉంటుంది. హాలులో కంటే కిటికీ దగ్గర ఎక్కువగా ఉంటుంది. మిద్దెమీద ఎక్కువగా ఉంటుంది. సెల్లార్‌లో కంటే పై అంతస్తులో ఎక్కువగా ఉంటుంది. సంకేతాలు (signal) ఎక్కువగా ఉండే దగ్గర మాట్లాడటం మంచిది.
ప్రయాణాల్లో మరింత రేడియేషన్‌
కారు, స్కూటరు, బస్సు, రైలు లాంట వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు సెల్‌ఫోను ఉపయోగించకూడదు. మన ఉన్న స్థానం మారేకొద్దీ సెల్‌టవర్‌తో అనుసంధానం తెగిపోతూ ఉంటుంది. కొత్త అనుసంధానం కోసం మన ఫోను ప్రయత్నిస్తుంది. ఆ సమయంలోనే రేడియేషన్‌ ప్రభావం ఎక్కువ. అందుకే ప్రయాణాల్లో వీలైనంత వరకు సెల్‌ఫోన్లను వాడరాదు. అనివార్యమైతే ఎస్‌ఎంఎస్‌లు ఉపయోగించుకోవాలి. లేదంటే వాహనాన్ని ఆపుకుని మాట్లాడాలి .
గర్భంలోని శిశువులపైనా ప్రభావం
గర్భవతులు వీలైనంత వరకు సెల్‌ఫోనును వాడరాదు.ఈ రేడియేషన్‌ వారి పొట్టల ఉన్న బిడ్డ మెదడుపై ప్రభావం చూపుతుంది. గర్భవతి ఉన్న గదుల్లో సెల్‌ఫోన్లను వాడటం మానుకోవాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలు సెల్‌ఫోన్లు వాడటం మంచిదికాదు. ఎందుకంటే వీరి పుర్రె లేతగా ఉండి, రేడియేషన్‌ వీరి మెదడులోకి సులభంగా ప్రవేశిస్తుందని శాస్త్రవిశ్లేషణలు తెలిపిన విషయం.
తలకింద పెట్టుకుంటే అంతే..
సెల్‌ఫోనును అలారంగా లాగా చాలా మంది వాడతారు. అలారం వినబడుతోందే లేదోనని తలగడకింద పెట్టుకుని నిద్రపోతారు. ఇలాచేస్తే ఓవెన్‌మీద మనం తల పెట్టినట్లే. ఇది చాలా ప్రమాదకరం. సుమారు ఆరు గంటలపాటు మన మెదడు రేడియేషన్‌కు గురవుతుంది. అలారంలాగా ఉపయోగించదలిస్తే మంచానికి 4 నుంచి 6 అడుగుల దూరంలో సెల్‌ఫోనును ఉంచుకోవాలి. లేదా ఆఫ్‌లైన్‌మోడ్‌లో ఉంచుకోవాలి. ఆఫ్‌లైన్‌మోడ్‌లో పెట్టుకుని పాటలు వినడం వల్ల రేడియేషన్‌ ప్రభావాన్ని తగ్గించొచ్చు.
ఈ విధంగా మనం తీసుకోగల్గినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఆధునికంగా వచ్చిన సెల్‌ఫోన్ల సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. అలాకాని పక్షంలో రేడియేషన్‌ ప్రభావంతో అనారోగ్యం పాలుకావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ( https://www.speakhealthindia.com   నుండి )