శ్రీ విద్యా ప్రకాశానంద గిరి స్వామీజీ

  రచయిత  శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –- ఉయ్యూరు 
 
గీతా మకరంద యోగి –శ్రీ విద్యా ప్రకాశానంద గిరి స్వామీజీ
 
వేదాంత ప్రవచనలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన వక్తలుగా ,నూట ఎనిమిది గీతా యజ్ఞాలను నిర్వహించి రికార్డు నెలకొల్పిన వారిగా ,నభూతో అన్నట్లు భగవద్గీత కు ‘’గీతా మకరందం ‘’పేరుతో అత్యద్భుత వ్యాఖ్యానాన్ని రాసి సామాన్యులను మాన్యులు చేసిన వారిగా ,వాల్మీకి మహర్షి రచించిన యోగవాశిష్ట బృహద్గ్రందానికి అతి సరళసంక్షిప్త తెలుగు తాత్పర్యాన్ని రాసి అరచేతిలో వెన్న ముద్ద లా అందించిన మహాను భావులు శ్రీ శ్రీ శ్రీ విద్యా ప్రకాశానంద గిరి స్వాములు .
 
            స్వామి పూర్వాశ్రమం పేరు తూను గుంట్ల ఆనంద మోహన్.తండ్రి గారు రామ స్వామి ,తల్లి సుశీలా దేవి లకు కృష్ణా జిల్లా మచిలీ పట్నం లో 13-4-1914 లోఅనూరాధా నక్షత్ర మొదటి పాదం లో  జన్మించారు .వ్యాసా శ్రమం స్థాపకులు మళయాళ స్వామి వారి శిష్యులు .విద్యా స్వామి వారి వాగ్ధాటి అమోఘం .దేశ మంతా సంచారం చేసి ఆధ్యాత్మిక విషయాల పైనా ,యోగా వాశిష్ట వివరణ మీద భగవద్గీతా ఉపన్యాసాలతో ప్రజలను ఉత్తేజ పరచిన సార్ధక జీవులు గీత కు వీరిలాగా  ప్రచారం నిర్వహించిన వారు లేరు అని పించుకొన్నారు ..వారి ప్రసంగాలలో చిన్న కధలు ప్రవాహం లా దొర్లి పోతుంటాయి.వీటిని హాస్య,వ్యంగ్యాలతో మేళ వించి విషయ జ్ఞానాన్ని తేలిక గా కలిగించే వీరి నేర్పు అద్వితీయం .మానవ జీవిత దృక్పధం అందులో ప్రతి బిమ్బించేది .నిసర్గ రమణీయం గా ,సరళ బోధకం గా ఉండి ఆస్తికుల మనసు లో భావం స్తిరం గా నిలిచి పోయేది .సామాన్యుని మాన్యునిగా జేసే గొప్ప ప్రక్రియ అది .
 
                తండ్రి గారు కుటుంబాన్ని తెనాలి చేర్చారు .అక్కడ ఆయన పేరు ప్రఖ్యాతులున్న లాయర్ .విపరీతం గా సంపాదన వచ్చి పడేది .అయినా వారికి ధనం మీద వ్యామోహం తగ్గి పోయింది . .సంపాదించిన చిర ,ష్ఠిర ఆస్తులను త్యజించి ,ఒక పూరి పాక వేసుకొని అందులో కుటుంబం తో గడిపారు .ఆధ్యాత్మిక సాధనలో జీవితం గడిపారు .ధ్యాన తప ,యోగా భజన ,పారాయణ ,అర్చన లతో ,వేదాంత చర్చా గోష్టులతో రోజంతా గడిపే వారు .కుటుంబమంతా ఈ వాతా వరణం లోనే గడిపింది ..బాల ఆనంద మోహన్ కూడా వీరితో బాటే అదే వాతావరణం లో పెరిగి చిన్నప్పటి నుండ ఉత్తమ సంస్కారాలను అల వరచుకొన్నాడు .
 
              ఆనాడే మోహన్ బాల మేధావి . .ఆట పాట,క్రీడలు పరుగు ,లాంగ్ జంప్,ఈత నడక ఒకటేమిటి అన్నిటా ప్రధమ శ్రేణి సంపాదించే వాడు ఆధ్యాత్మిక విద్య ఎట్లాగూ ముందే అలవడిందికదా ..భర్త్రు హరి  హరి సుభాషితాలన్నీ కంఠోపాఠం  .భగవద్గీత అంతా నోటికి వచ్చే సింది .అనేక సభల్లో వాటిని విని పించి మెప్పు పొందే వాడు .బందరు నోబుల్ కాలేజి లో 1928 లో చేరి ఇంటర్ ,డిగ్రీ లను సాధించాడు .రాజ మండ్రిలోని హిందూ సమాజం నిర్వ హించిన రాష్ట్ర స్తాయి పోటీలలో ఆనంద మోహన్ నగదు బహుమతి పొందాడు .ఆ డబ్బుతో స్వామి వివేకా నంద పుస్తక సర్వస్వాన్ని కొని చదివేశాడు .జేర్ణం చేసుకోన్నాడుకూడా .మళయాళ స్వామి మచిలీ పట్నాన్ని న్ని సందర్శించి నపుడు బాల మోహన్ తండ్రి గారితో అన్న పూర్ణ మఠంలో దర్శనం చేసుకొని ఆ యన దృష్టిని ఆకర్షించాడు .మళయాళ స్వామి ఆనందమోహన్ కు అప్పుడే పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించారు .దానితో వారి విద్య శర వేగం గా దూసుకు పోయింది .ఆంగ్ల ,ఆంధ్రాలలో గొప్ప పాండిత్యాన్ని సంపాదించారు .సంస్కృతం హిందీ లలోను మెలకువలను నేర్చాడు .హిందీ లో విశారద పరీక్ష రాసి ఉత్తీర్నులయారు .అప్పుడే జాతీయోద్యమం ఊపు లో ఉంది .
 
         ఆనంద మోహన్ కాశీ వెళ్లి కాశీ విద్యా పీఠ లో చేరాడు .అక్కడే ఈత ,వాలీ బాల్ ఫుట్ బాల్ లో ప్రావీణ్యం సాధించాడు నిత్య యోగా సాధన లో ప్రాణాయామం తో ఖాళీ సమయాన్ని సార్ధకం చేసుకొనే వాడు విద్యా లయం లోని ఆంగ్ల పత్రికకు సహాయ సంపాదకుడిగా ‘’,తపో భూమి’’ పత్రికకు సంపాదకుని గా తన సమర్ధ త ను నిరూపించుకొన్నాడు .ఇతని బహుముఖ ప్రజ్ఞ విద్యార్ధులను ,అధ్యాపకులను విశేషం గా ఆకర్షించింది .ఒక్క ఏడాది కాశీ లో ఉండి హిందీ డిగ్రీ పొందారు.కాశీ లో ఉండగానే మహాత్మా గాంధీ, పటేల్ రాజేంద్ర ప్రసాద్ లాంటి ఉద్దండ దేశ భక్త రాజకీయ నాయకులను చూసే అదృష్టం కలిగింది .గాంధి బస చేసిన చోట ఈ కుర్రాడికి వాలంటీర్ గా పని చేసే అవకాశం లభించింది .తర్వాత విజయ వాడ చేరారు ఇక్కడ జీవితం ఒక గొప్ప మలుపు తిరిగింది .
 
           ఒక సారి మళయాళ స్వామి వారు విజయ వాడ వచ్చి మోహన్ తండ్రి రామ స్వామి గారింటికి భిక్షకు వచ్చారు .అప్పుడు ఆనంద్ ఇంట్లో లేడు .స్వామి తన కున్న అయిదుగురు కుమారులలో ఒకరిని తన ఆశ్రమానికి అందించమని కోరారు .ఏమీ ఆలోచించకుండా ఆనంద్ నిస్తానని చెప్పాడు తండ్రి .అతనే సమర్ధుడు ఆధ్యాత్మిక ఉన్నతి ఉన్న వాడు .స్వామిని హరిద్వారం లో తండ్రీకొడుకులు దర్శించారు .స్వామిజీ తో ఋషీకేశ్ మొదలైన ప్రదే శాలు,ఆశ్రమాలను  సందర్శించారు .ఇక్కడే గొప్ప పరిణామం  సంభవించింది .ఋషీకేశ్ లో గంగా నదిలో పడవ లో వెళ్తుంటే ఒక గడ్డిమోపు కొట్టుకోస్తోంది .దాన్ని చేత్తో పట్టుకొని పడవ లోకి తీసుకొన్నాడు .ఆశ్చర్యం -అందులో సంస్కృత భగవద్గీత ,దాని పై పరిమళ పుష్పాలు కన్పించాయి .అది భగ వంతుని కానుక గ భావించి కళ్ళకద్దుకొని తనతో యాత్ర పూర్తీ అయ్యే దాకా భద్రం గా ఉంచుకొని విజయ వాడ తెసుకొని వచ్చాడు .
 
                   అప్పుడే ఆయనకు ఆధ్యాత్మ జీవితాన్ని మళయాళ స్వామి వారి ఆశీస్సు ల తోనే గడపాలని నిర్ణయించుకొన్నాడు ..ఆత్మ సాక్షాత్కారం కోసం తీవ్ర తపన చెందాడు ఇది విని కుటుంబం ,స్నేహితులు అందరు అమిత గౌరవం గా చూశారు .అతనంటే ఆరాధనా భావం పెరిగింది .వేదాంతం అంతు చూడాలని నిశ్చయించుకొన్నాడు కాబోయే స్వామి అయిన ఆనంద మోహన్ . 1936 మే 17ఏకాదశి నాడునంది కొండలదిగువన  ఉన్న వ్యాసాశ్రమం చేరి మళయాళ స్వామిని సందర్శించారు .దీనికి దగ్గర లోనే ఉన్న శిష్టాశ్ర్సమం దగ్గర్లో ‘’గుహాశ్రమం ‘’కేటాయించారు .అక్కడే ఒంటరిగా ఉండి సాధన చేయమని గురు వు గారి ఆదేశం …అక్కడ అన్నీ పచ్చి కూరలు మితాహారం జపం ,తపం ధ్యానం ల తో ఆత్మోద్దీపనకోసం తీవ్రం గా కృషి చేశారు .అప్పుడే వాల్మీకి రాసిన సంస్కృత యోగా వాశిష్టం 32000శ్లోకాలను ఆరు సంవత్సరాలు తీవ్ర కృషి చేసి సరళ సుందర సంక్షిప్త ఆంధ్రాను వాదం  చేశారు .ఇది ఒక బృహత్తర గ్రంధం .ఎందరినో ఆకర్షించింది .బౌద్ధ గ్రంధం  ‘’ధమ్మపదం’’ ను తెలిగించారు .       గురువులు మళయాళ స్వామి పతంజలి యోగా శాస్త్రాన్ని ,భగవద్గీతను ,ఓంకార తత్వాన్ని విశదీకరించారు .ఆరేళ్ళు మౌన వ్రతం లో గడిపారు .29-6-1947 ‘’నాడు మళయాళ స్వామి ఆనంద్ కు సన్యాసాశ్రమం ఇచ్చి ‘’విద్యా ప్రకాశానంద గిరి స్వామి ‘’అని ఆశ్రమ నామాన్ని పెట్టారు . బ్రహ్మ నిష్ఠ తో గడిపారు .గురువు అను మతి తో వ్యాసాశ్రం వదిలి చిత్తూరు జిల్లా కాళ హస్తి దగ్గర శుక మహర్షి పేరుతో ‘’శుకాశ్రమం ‘’ను20-1-1950న   ఏర్పాటు చేశారు .మళయాళ స్వామితమ అమృత హస్తాలతో  దీన్ని ప్రారంభించారు .ఇక్కడే తర్వాత ‘’ఆనంద ఆస్పత్రి ‘’ని పేదలకోసం నిర్మించారు .వశిష్ట గీతను శుకాశ్రమం నుండే ప్రచురించారు . .గీతా మకరందం అనే బృహత్ గ్రంధాన్ని రాసి సామాన్యులకు గీత పరమార్ధాన్ని తేట తెల్లమయ్యేట్లు రచించారు .దీని వ్యాప్తి తిరుగు లేనిది .’’వేదాంత భేరి ‘’అనే మాస పత్రికను నడిపారు . .108 గీతా యజ్ఞాలను దేశ మంతటా నిర్వహించారు .100,108 వ యజ్ఞాలను హైదరా బాద్ లో నిర్వహించి అశేష ప్రజలకు మహదానందాన్ని కల్గించారు .స్వామి ఎక్కడకు వెళ్లి ఉపన్య సింన్చినా వేలాది జన సమూహం చేరి అత్యంత శ్రద్ధ,భక్తి  తో వినే వారు .
 
              తీరిక లేకుండా నిత్యం దేశ సంచారం ,అలుపు లేకుండా ఉపన్యాసాలు ,నిష్ఠ తో గీతా యజ్ఞాల నిర్వహణ తో ఆరోగ్యం దెబ్బతిన్నది .1994 నుండి తీవ్ర అనారోగ్యానికి గురైనారు .హైదరా బాద్ ,మద్రాస్ లలో చికిత్స జరిగింది .మూత్రపిండాలు దెబ్బ తిన్నాయని తేలింది చివరికి 10-4-1998 ఉదయం ఏడున్నర గంటలకుఎనభై నాల్గవ ఏట సార్ధక జీవితం గడిపి  సిద్ధి చెందారు .విద్యా ప్రకాశా నంద స్వామి రచించిన గీతా మకరందం అయిదు భాషల్లో వెలువడి విశేష ప్రాచుర్యం పొందింది .మొత్తం 42 గ్రంధాలు రచించారు .అందులో కొన్ని –గీతా మకరందం ,యోగా వాశిష్టం ,భారత రత్నాకరం ,భాగవత రత్నాకరం ,ఉపనిష్ద్రాకరం ,గీతోపన్యాసాలు మోక్ష సాధనా రహస్యం ,ఆత్మాను సంధానం ,బ్రహ్మానంద వైభవం ,భజన కీర్తనలు ,అమృత బిందువులు ,మధు సూదన సరస్వతి రచన ‘’గూడర్ధ దీపిక ‘’కు అనువాదం మొదలైనవి .
 
         చదువుకొనే రోజుల్లో అన్నిటా ప్రధమం గా ఉన్న స్వామి ఆశ్రమ జీవిత్సం లోను ప్రధమ శ్రేణి పరివ్రాజకులు గా ,గీతార్ధ రహస్య వివరణ లో, యోగా వాశిష్ట వైభవ విశదీకరణ లో,యోగ సాధనలో ఉపన్యాసామృతాన్ని అందివ్వటం లో చిన్న కదలనాధారం గా అతి గహన మైన వేదాంత రహస్యాలను అందరికి అందు బాటు చేయటం లోను,గీతా యజ్న నిర్వహణలో, వేదాంత భేరి లో ను అద్వితీయులై  ,దీన జనోద్ధరన ,ఆరోగ్యమందివ్వటం లోను సర్వ ప్రధములై చిర కీర్తి నార్జించారు శ్రీ విద్యా ప్రకాశానంద గిరి స్వామిజీ ..
 
             
                    రచయిత  శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –23-11-12-ఉయ్యూరు