శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు

 (వికీపీడియా నుండి)
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కాకినాడ వాస్తవ్యులు. వీరి తండ్రి చాగంటి సుందర శివరావు గారు; తల్లి సుశీలమ్మ గారు. కోటేశ్వరరావు గారి సతీమణి శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు; శ్రీ శారదా మాత అనుగ్రహముతో అనితర సాధ్యమైన ధారణ పటిమతో అనర్గళమైన ప్రవచనములకు ఆయనకు ఆయనే సాటి. మానవ ధర్మం మీద ఆసక్తి తో అష్టాదశ పురాణములను అథ్యయనము చేసి తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ భక్త జన మనసులను దోచుకున్న ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నటువంటి మహా జ్ఞాని.
మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని, మరియు 40 రోజుల పాటు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమును అనర్గళంగా ప్రవచించి పామరుల మరియు పండితుల మనసులు దోచుకొని విన్నవారికి అవ్యక్తానుభూతిని అందించి, కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా ఎంతో మంది తెలుగు వారికి దేశ విదేశ వ్యాప్తంగా తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేయుచున్నారు 
 
ప్రవచనాలు
 
చాగంటి కోటేశ్వర రావు ప్రసంగించిన ప్రవచనాలు సంపూర్ణ రామాయణము, ఇవి బాల కాండ నుండి పట్టాభి షేకము వరకు చెప్పబడ్డాయి. శివ పురాణము నండు భక్తుల కథలు, మార్కండేయ చరిత్ర, నంది కథ, జ్యోతిర్లింగ వర్ణన, లింగావిర్భావము, రమణ మహర్షి జీవితము మొదలైన అనేక విషయాలు చోటు చేసుకున్నాయి. విరాట పర్వము అనే ప్రవచనంలో భారతమునందలి అజ్ఞాత వాస పర్వము వివరించబడింది. భాగవతము అనే ప్రవచనంలో భాగవతుల కథలు, కృ ష్ణావతారం యొక్క పూర్తి కథ చోటు చేసుకుంది. భాగవత ప్రవచనాలలో ప్రధమముగా శ్రీకృష్ణ నిర్యాణం, పాండవుల మహాప్రస్థాన కథ చోటు చేసుకున్నాయి. సౌందర్య లహరి ఉపన్యాసాలు ఆది శంకరాచార్య విరచిత సౌందర్య లహరి వివరణ ఉంది. శిరిడీ సాయి బాబా కథ చోటు చేసుకుంది. ఇంకా రుక్మిణీ కల్యాణం, కనకథారా స్తోత్రం, గోమాత విశిష్టత, భజగోవిందం, గురుచరిత్ర, కపిల తీర్ధం, శ్రీరాముని విశిష్టత, తిరుమల విశిష్టత, హనుమజ్జయంతి, హనుమద్వైభవం, సుందరాకాండ, భక్తి, సామాజిక కర్తవ్యం, శంకరాచార్య జీవితం, శంకర షట్పది, సుబ్రహ్మణ్య జననం మొదలైన ప్రవచనాలు చేసారు కోటేశ్వర రావు. ఆయన తన వాక్పటిమతో హృద్యమైన ప్రవచనములను చేసి ప్రముఖుల నుండి బ్రహ్మశ్రీ అని గౌరవ నామాన్ని పొందారు.
 
శారదా జ్ఞాన పుత్ర 
 
జగద్గురు ఆది శంకరులు అధిష్ఠించిన కంచి కామకోటి పీఠ ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శంకర జయేంద్ర సరస్వతీ స్వామివారు, ఉప పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వార్లు ఆశీఃపూర్వకంగా పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారిని నందన నిజ బాధ్రపద పౌర్ణమినాడు (30-09-2012) కామకోటి పీఠం తరఫున సత్కరించి, ప్రవచన చక్రవర్తి అనే బిరుదు ప్రదానం చేసారు .
 
స్వగతం
 
శ్రీయుత చాగంటి కోటేశ్వరరావు గారి గురించి వ్రాయాలంటే నా వద్ద భాష లేదు. వారు మాటలాడుతుంటే ఆ 'సరస్వతీదేవి' వారి నాలుక మీద నర్తిస్తున్నట్లే నాకు అనిపిస్తుంది. వారు ఎన్నో ప్రసంగాలు చేశారు. ఈ ఉరకల పరుగుల జీవితంలో అందరికీ అన్నీ వినే భాగ్యం వుండదు. ఒక్కో ప్రసంగం ఒక్కో ఆణిముత్యమే... నేనొక ఆణిముత్యాన్ని నా సెల్ ఫోన్ లో భందించి.. నా సహ వుద్యోగులకు, నా విధ్యార్ధులకు అవకాశం కుదిరినప్పుడల్లా వినిపిస్తూ వుంటాను. వారందరూ అది విన్నతరువాత వారి ఆలోచనా విధానంలో వచ్చిన మార్పును నాతో పంచుకుంటుంటే నాకైతే ఎంత ఆనందమేస్తుందో చెప్పలేను. ముందుగా నా బ్లాగులో https://tellenglish.blogspot.in/ చాగంటి గారి వెబ్సైట్ లింక్ ఇచ్చినప్పుడు ఎందరో మిత్రులు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మెసేజ్ చేశారు. పూలదండలోని దారానికి సువాసన రావడమంటే ఇదేనేమో! వారి గురించి తెలియని వారు ఆసలుండరు.తెలియని ఒకరిద్దరు నా బ్లాగుద్వారా వారి వెబ్సైట్ లింక్ తెలిసికుని ఆ మహానుభావుని ప్రసంగాలన్నీ విని సంతోషంతో నాకు తెలిపిన కృతజ్ఞతలు చాగంటి వారి పాదపద్మములకే కదా.. ఇంతకీ నా విధ్యార్ధులకు వినిపించే ప్రసంగాన్ని మీరు కూడా వినాలనుకుంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి.  https://telugu.srichaganti.net/SocialResponsibilities
1 గంటా 21 నిమిషాలు దేవునికి నివేదనలా భావించి శ్రద్దగా వినండి Please.. మీ ప్రతాప్