శంకర్ నేత్రవైద్యశాల

ఎక్కడినుంచి సంపాదించామో- తిరిగి అక్కడికే పంపిద్దాం' ఇదీ మనిషికి మేఘం నేర్పే పాఠం. దీనిని ఆకళింపు చేసుకుని ఆచరించే వారు ప్రపంచానికి దగ్గరగా, ప్రచారానికి దూరముగా సేవలు అందిస్తూ వుంటారు. అలాంటి వ్యక్తి ఆత్మకూరి శంకర రావు గారిచే నెలకొలిపిన సంస్థ 'శంకర్ ఫౌండేషన్'సాగరతీరం విశాఖ లో కన్ను తెరిచిన ఈ సేవాకేంద్రం ఉత్తరాంద్రలో ఉదారంగా పనిచేస్తోంది. నిశీధి కమ్ముకుంటున్న కనుపాపల లోగిళ్ళలో నిరాడంబరంగా వెలుగులు ప్రసరిస్తోంది.
 
పద్నాలగో ఏట చదువు ఆగిపోయింది. బతుకు ఆరాటం ఆరంభమైనది.ఆ పై బ్రతుకు బాటలో ఎన్నో మలుపులు, ఎన్నెన్నో మజిలీలు..... తరువాత కోట్లు గడించినా గతాన్ని ఆయన మరచిపోలేదు.' సంపద' మనకి సుఖాన్ని ఇవ్వడంతోపాటు మరొకరి కష్టాల్ని గట్టెక్కించే వరం' ఇదీ ఆయన నమ్మిన సిద్దాంతం. అందుకే తన అరవయ్యో వడిలో తన సంపాదనను సమాజం కోసం సద్వినియోగం చేసే దిశగా అడుగు ముందుకు వేశారు.దీనికి వారి శ్రీమతి యశోదగారు  పాదం కలిపారు. వీరి స్ఫూర్తితో మనసున్న మారాజులు ఎందరో వీరికి అండగా నిలిచారు. అప్పటికే 40.000 ఆపరేషన్లు చేసిన అనుభవం వున్న  డాక్టర్  సూర్యనారాయణ రాజు గారి ఆద్వైర్యంలో  సంస్థ పురుడు పోసుకుంది. 
 
పేదలపాలిటీ పెన్నిధిగా ఉన్న శంకర్ కాంటియాసుపత్రి రధసారధి శంకర రావుగారికి. అక్కడి వైద్యబృందానికి, అక్కడి చెట్టుకీ,పుట్టకీ మనసా, వాచా మనము కృతజ్ఞతలు తెలియజేద్దాం. నమస్తే మీ వి.వి.ప్రతాప్ 
 
(ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధం 14 మే 2006 నుండి సేకరణ)