గుండె జబ్బులు – యాంజియోగ్రామ్‌ – యాంజియోప్లాస్టీ

శ్రీయుత డాక్టర్‌ ఎ.రవికుమార్‌, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌- హైదరాబాదు 
 
వంశపారంపర్యంగా గుండెజబ్బులొచ్చే రిస్క్‌ వుంటే జాగ్రత్తపడాలి. అపుడప్పుడూ పరీక్షలు చేయించుకుంటుండాలి. సకాలంలో అవసరమైన చికిత్స పొందుతుండాలి. పుట్టుకతో కూడా కొన్ని లోపాలు వస్తుండవచ్చు. వాటి విషయంలోకూడా సరైన జాగ్రత్తలు తీసుకుంటుండాలి. సిగరెట్లు తాగే అలవాటున్నా, మందుతీసుకునే అలవాటున్నా వ్యాయామం లేని వాళ్ళూ, కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్నవాళ్ళు తమ జీవన విధానాన్ని మార్చుకోవటం అవసరం.
గుండె కవాటాలలోపం వున్నా… గుండె నిర్మాణంలో ఎటువంటి లోపాలున్నా, గుండెకి రక్తం సరఫరా చేసే మూడు రక్తనాళాల్లో అడ్డంకులున్నా సకాలంలో గుర్తిస్తే సరిచేయటానికి చికిత్సలున్నాయి. గుండెకి సంబంధించిన ఈ శస్త్రచికిత్స కూడా ఇప్పుడు కీ హోల్‌ ద్వారా చేస్తున్నారు. ఆధునిక వైద్యంలో కోతని సాధ్యమైనంత తగ్గించి చికిత్సను చేస్తున్నారు. కోత పెద్దదైన కొద్దీ ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే రక్తస్రావం ఎక్కువే. నయం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది. చిన్న రంధ్రం ద్వారా క్యాథటార్‌ను లోపలికి పంపి రక్తనాళాలలోని అడ్డంకుల్ని తొలగించే ప్రక్రియని యాంజియోగ్రామ్‌ అంటారు. ఇదేే విధంగా లోపలికి వెళ్ళి అడ్డంకుల్ని తొలగించే ప్రక్రియని యాంజియోప్లాస్టీ అంటారు. ఈ యాంజియోప్లాస్టీ ద్వారా అడ్డంకుల్ని తొలగించినప్పుడు ఆ ప్రాంతంలో రక్తనాళం మూసుకుపోకుండా స్టెంట్లను వుంచుతారు. యాంజియోని మొదట్లో తొడలోని ఫెమరల్‌ రక్తనాళం ద్వారా చేసేవారు. అందువల్ల రోగి కదలకుండా 24 గంటలైనా పడుకోవాల్సి వచ్చేది. రక్తస్రావం కాస్తఎక్కువగానే ఉండేది. అందుకని ఇప్పుడు చేతి మణికట్టు దగ్గరున్న రేడియల్‌ ఆర్టరీ ద్వారా రక్తనాళంలోకి క్యాథటార్‌ను పంపి యాంజియో పరీక్షలు చేస్తున్నారు. దీన్నే రేడియల్‌ యాంజియో అంటారు.
గుండెకి రక్తం కరోనరి ఆర్టరీ మూడు శాఖల ద్వారా ప్రసరణ జరుగుతుంది. ఈ మూడు రక్తనాళాలో కూడా ఎడమపక్కన ఉండే శాఖ గుండెకి రక్తం సరఫరా చేసే ప్రధాన నాళం. గుండెకి యాభైశాతం రక్తం ఈ రక్తనాళం ద్వారానే ప్రసరణ జరుగుతుంటుంది. అందుకని ఈ ఎడమ ప్రక్కనున్న ప్రధాన రక్తనాళంలో అడ్డంకులొచ్చినా, రక్తనాళాలు చీలే చోట అడ్డంకులున్నా అలాగే మూడు సంవత్సరాలకు పైగా రక్తనాళాలలో వందశాతం అడ్డంకి ఏర్పడి అదిగట్టిపడిపోయినా, హార్ట్‌ఎటాక్‌ వచ్చిన వాళ్ళ రక్తనాళాలలో అడ్డంకుల్ని తొలగించడానికి బైపాస్‌ సర్జరీ వచ్చిన తరువాత గ్రాఫ్ట్‌ దగ్గర అడ్డంకులులేర్పడినా తొలగించడానికి చేసే యాంజియోలని కాంప్లెక్స్‌ యాంజియోలు అంటే క్లిష్టతరమైన యాంజియోలన్నమాట. ఈ యాంజియోలు చాలా జాగ్రత్తగా చేయాలి. అందుకు మంచి నేర్పు ఉండాలి. గుండెపోటు వచ్చిన తరువాత ప్రైమరి యాంజియోప్లాస్టీ స్టెంటింగ్‌ చేస్తారు. రక్తనాళాలు రెండుగా, మూడుగా చీలేచోట్ల కిస్సింగ్‌ బెలూన్‌ యాంజియోపాస్టీ చేసి స్టెంట్‌లతని వేస్తారు. ఇంతకముందు వీటికి శస్త్ర చికిత్సలు చేసేవారు ఇప్పుడు వీటికి శస్త్రచికిత్స లేకుండా సన్నటి రంద్రాన్ని చేతి మనికట్టు దగ్గరచేసి దాని ద్వారా క్యాథటార్‌ని లోపలికి పంపి అడ్డంకుల్ని తొలగిస్తున్నారు. కొన్ని గంటలు లే ఒక రోజులో రోగి ఇంటికి వెళ్ళిపోవచ్చు.
 
DR A.Ravi Kumar -డాక్టర్‌ ఎ.రవికుమార్‌,సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ హైదరాబాద్‌.