అభినవ వ్యాసుడు

Sakshi | Updated: June 04, 2013 03:27 (IST)
India :పురాణ ప్రవచనం అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చేది అభినవ వ్యాస బిరుదాంకితుడు మల్లాది చంద్రశేఖరశాస్త్రి. ఆయన స్వరంలోని మాధుర్యం, రామాయణ,భారత, భాగవతాలపై ఆయనకున్న పట్టు కారణంగా పురాణప్రవచన ప్రముఖులలో ఆయన ప్రత్యేకతను సంతరించుకున్నారు. శ్లోకార్ధ తాత్పర్యాలతో దృశ్యాన్ని కన్నులకు కట్టినట్టు చెప్పగల దిట్ట చంద్రశేఖరశాస్త్రి. గాత్రానికి శృతిజ్ఞానం, నాటకధోరణి సమన్వయం చేసి పురాణం చెప్పడంలో ఆయన అగ్రగణ్యుడు. తన పదిహేనవ ఏట నుంచి ప్రారంభించిన ఈ ప్రవచన యజ్ఞం అసిధారావ్రతంగా ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం 87 ఏళ్లు పైబడినా ఉపన్యాసం, హరికథ, నాటకం, పురాణం కలిపి శ్రోతలను ఆకట్టుకునే విధంగా పురాణ ప్రవచనం చేయడంలో శాస్త్రిగారిని మించిన వారు లేరు.
 
 
పొగాకు చుట్ట, హరిదాసు పొట్ట, తమలపాకుల కట్ట తరచు తడపాలనే నానుడిని సైతం అబద్ధం చేస్తూ గంటల తరబడి అనర్గళంగా పురాణప్రవచనం చెప్పినా కనీసం మంచినీరు కూడా తీసుకోకపోవడం అభినవ వ్యాసుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రికే చెల్లుతుంది. కిరోసిన్ దీపాల వెలుగులో పురాణం చెప్పే రోజుల నుంచి నేడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆడిటోరియంలో మల్లాదివారి పురాణ ప్రవచనమంటేనే భక్తులు తండోపతండాలుగా పాల్గొంటారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శైవక్షేత్రమైన అమరారామంలో జన్మించిన మల్లాది చంద్రశేఖరశాస్త్రి అమరావతి ఆణిముత్యం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 
 
విద్యాభ్యాసం
మల్లాది దక్షిణామూర్తి దంపతులకు 1925 ఆగస్టు 28వ తేదీన జన్మించిన చంద్రశేఖరశాస్త్రి సనాతన సత్సంప్రదాయం గల కుటుంబంలో జన్మించారు. మొదటి నుంచి ఆచార వ్యవహారాలలో ఎంతో నిష్టగా వ్యవహరించేవారు. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో వీరి కుటుంబం వేద విద్యలో నిష్ణాతులుగా మంచి పేరుగాంచింది. బాల్యంలో చంద్రశేఖరశాస్త్రి తన తాతగారైన పండిత ప్రవర మల్లాది రామకృష్ణ విద్వత్ చయనులవద్ద సంస్కృతం, తెలుగు, శాస్త్ర ప్రకరణం, వేదాధ్యయనం చేశారు. వేదాలు, వ్యాకరణం, తర్కం, పూర్వమీమాంస, వేదాంత శాస్త్రం, రామాయణ, భారత,భాగవత, భగవద్గీతలను పూర్తి స్థాయిలో నేర్చుకున్నారు. కంభంపాటి రామమూర్తి శాస్త్రి వద్ద కౌముది, మనోరమ, పూర్వపు గ్రంథాలను, పినతండ్రి మల్లాది హరిశంకరశాస్త్రివద్ద 82 పన్నాల వేదం, శ్రౌతం, స్మార్తాధ్యయనం, ధర్మశాస్త్రం, అంబడిపూడి నరసింహశాస్త్రి వద్ద తర్కశాస్త్రం, కృష్ణమాచార్యులవద్ద పూర్వమీమాంసశాస్త్రం, మద్దుల మాణిక్యశాస్త్రివద్ద వేదాంత శాస్త్రం అధ్యయనం చేశారు.
 
బిరుదులు, సన్మానాలు, సత్కారాలు...
మల్లాది చంద్రశేఖరశాస్త్రి తన సుదీర్ఘ పురాణ ప్రవచన ప్రస్థానంలో ఎందరో ప్రముఖులు, ప్రముఖ సంస్థలతో లెక్కలేనన్ని సన్మానాలు, సత్కారాలు, బిరుదులు పొందారు. అందులో ప్రముఖంగా తిరుమల తిరుపతి దేవస్థానాలలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యాతగా స్వామివారి కల్యాణాన్ని భక్తుల కన్నుల ముందు సాక్షాత్కరింపచేసి అభినవ వ్యాస బిరుదును పొందారు. శృంగేరి పీఠాధిపతి చంద్రశేఖరస్వామి ఆశీర్వదించి సవ్యసాచి బిరుదును, భీమునిపట్నంలో సద్గురు శివానందమూర్తి నెలకొల్పిన సంతానధర్మట్రస్ట్ ద్వారా ఎమినెంట్ సిటిజన్ అవార్డును అందుకోవడమే కాక మాజీ ప్రధాని పి.వి నరసింహారావుతో సత్కారం అందుకున్నారు. 2005లో ప్రతిష్టాత్మక రాజా-లక్ష్మీ అవార్డు ద్వారా వచ్చిన లక్ష రూపాయల నగదును సంతానధర్మట్రస్టుకు విరాళమిచ్చిన సహృదయుడాయన. 
 
అమెరికాలో న్యూజెర్సీ తెలుగు ఫైన్ అర్ట్స్ సొసైటీ ద్వారా చంద్రశేఖరశాస్త్రికి ఆమెరికా లోని తెలుగువారంతా సన్మానించడం విశేషం. ఆలిండియా రేడియోలో భద్రాచల సీతారామకల్యాణంకు వ్యాఖ్యాతగా యావత్ భక్తజన ప్రశంసలు పొందారు. చాలాకాలం ఉగాది నాడు ఆంధ్రప్రధేశ్ ప్రభుత్వం ఆధ్యర్యంలో నిర్వహించే పంచాంగశ్రవణం ద్వారా చంద్రశేఖరశాస్త్రి సుపరిచితులు. నేటికీ శ్రీవెంకటేశ్వర భక్తి చానల్‌లో ధర్మసందేహలు, ధర్మసూక్ష్మాలు కార్యక్రమంలో పురాణాలలో, హిందూ సంప్రదాయాలు, ధర్మాలు, వివిధ ఆధ్యాత్మిక విషయాలకు సంబందించిన టెలివిజన్ ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. తన యశస్సు, కీర్తిప్రతిష్టలు తన స్వగ్రామమైన అమరావతి అమరేశ్వరుని చరణారవిందాలకు అంకితమివ్వడం చంద్రశేఖరశాస్త్రికి అమరేశ్వరునిపైనున్న భక్తికి నిదర్శనం.
- సాక్షి- న్యూస్‌లైన్, అమరావతి